Exodus 18

1యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి, మోషేకు, అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు జరిగించినదంతా మిద్యానులో యాజకుడైన మోషే మామ యిత్రో విన్నాడు. 2మోషే మామ యిత్రో మోషే తన దగ్గరకు పంపిన మోషే భార్య సిప్పోరాను, 3ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకడి పేరు గెర్షోము. ఎందుకంటే మోషే <<నేను అన్య దేశంలో పరాయివాణ్ణి>>అన్నాడు. 4రెండో వాడి పేరు ఎలియాజరు. ఎందుకంటే <<నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం. అయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు>> అని అతడు అన్నాడు.

5మోషే మామ యిత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యనూ వెంటబెట్టుకొని ఎడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోషే దగ్గరికి వచ్చాడు. 6<<నీ మామ యిత్రో అనే నేనూ నీ భార్య, ఆమెతో కలసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరకు వస్తున్నాము>> అని మోషేకు కబురు పంపాడు.

7మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకొని గుడారంలోకి వచ్చారు.

8తరువాత యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరోకు, ఐగుప్తీయులకు చేసినదీ మార్గంలో తమకు సంభవించిన కష్టాలూ వాటి నుండి యెహోవా తమను విడిపించిన విషయం మోషే తన మామకు వివరంగా చెప్పాడు.

9యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ళు విని యిత్రో సంతోషించాడు. 10యిత్రో <<ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగు గాక. 11యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులపట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్టు వారి వశంనుండి ఆయన తన ప్రజలను రక్షించాడు>> అన్నాడు.

12మోషే మామ యిత్రో హోమబలి, ఇతర బలులు దేవునికి అర్పించాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు మోషే మామతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు.

13మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రజలు మోషే దగ్గర బారులు తీరి నిలబడ్డారు.

14ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో <<నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడివే కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి?>> అని అడిగాడు.

15మోషే <<దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 16వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను>> అని తన మామతో చెప్పాడు.

17అందుకు మోషే మామ అతనితో <<నీవు చేస్తున్న పని మంచిది కాదు. 18ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది. 19నా మాట విను. నేను నీకొక ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి. 20ప్రజలకు దేవుని చట్టాలూ ధర్మశాస్త్ర నియమాలూ బోధించాలి. వాళ్ళు నడుచుకోవలసిన మార్గాలను, చేయవలసిన పనులనూ వాళ్ళకు తెలియజెయ్యాలి.

21నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులుకాని సమర్ధులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వాళ్ళను నియమించు. 22వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు. పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరకు తీసుకు వస్తారు. చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్ళే పరిష్కరిస్తారు. ఆ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది. 23ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు>> అని చెప్పాడు.

24మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు.

25మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు. 26వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయాధికారులుగా ఉన్నారు. చిన్న చిన్న తగాదాలు తమకు తాము పరిష్కరించేవాళ్ళు. కఠినమైన తగాదాలు మోషే దగ్గరకు తెచ్చేవారు. తరువాత మోషే తన మామను సాగనంపాడు, అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు.

27

Copyright information for TelULB